• 2 days ago
SLBC Tunnel Rescue Update : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8మందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో 8 మంది ఎక్కడున్నారో జీబీఆర్ మిషన్‌తో గుర్తించినా వారిని బయటకు తీసుకువచ్చేందుకు మాత్రం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అక్కడ నెలకొన్న ప్రతికూల పరిస్థితులే అందుకు ప్రధాన కారణం. ప్రమాదం జరిగిన సొరంగ మార్గం 14 కిలోమీటర్లు ఉంటుంది. 14 కిలోమీటరు వద్దే పైనుంచి మట్టి, నీరు, బురద ఒక్కసారిగా ముంచెత్తి, సెగ్మెంట్లు కుప్పకూలి ఉపద్రవం సంభవించింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు. ప్రమాదం ధాటికి టన్నెల్ బోరింగ్ మిషన్ రెండు ముక్కలుగా విడిపోయింది. వెనకభాగం అర కిలోమీటరు వరకు కొట్టుకు రాగా, ముందు భాగం పూడికలో కూరుకుపోయింది. ఈ రెండింటి మధ్య 3 నుంచి 5 మీటర్ల వరకూ బురద పేరుకుపోయింది. టన్నల్ ముందు భాగంలో సొరంగం మొత్తాన్ని మూసి వేస్తూ10 నుంచి 15 మీటర్ల వరకూ మట్టి నిండి పోయింది. రెండు టన్నెల్ భాగాల మధ్యలో నలుగురు, టన్నల్ ముందు భాగం కింద సుమారు 15 నుంచి 20 అడుగుల లోతులో మరో నలుగురు చిక్కుకుని ఉన్నారని రాడార్ సర్వే చెబుతోంది.

దీని ఆధారంగా గుర్తించిన 4 అనుమానిత ప్రాంతాల్లో ఏకకాలంలో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వతున్న కొద్దీ ఊటనీరు వచ్చి చేరుతుండటంతో తవ్విన గుంతలు తిరిగి మూసుకుపోతున్నాయి. నిరంతరాయంగా ప్రవహిస్తున్న నీరు అందుకు అడ్డంకిగా మారుతోంది. సుమారు 3 నుంచి 5 మీటర్ల వరకూ తవ్వితే తప్ప సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలియదు. అందుకోసం సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తొలుత రెండు టీబీఎం మిషన్ భాగాల మధ్య చిక్కుకున్న నలుగురిని బయటకు తీయాలన్న లక్ష్యంతో సహాయక చర్యలు ముందుకు సాగుతున్నాయి. టీబీఎం ముందు భాగం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే వారంతా 15 నుంచి 20 అడుగుల లోతులో ఉన్నారని జీబీఆర్ సర్వే చెబుతోంది.

Category

🗞
News

Recommended